రాజమహేంద్రవరం, సామాజిక స్పందన
తెదేపా అధినేత చంద్రబాబును జైలులో బంధించి ఇవాళ్టికి 50 రోజులైందని.. ఏ తప్పూ చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే ఆయనను అరెస్టు చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు..
వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజల మధ్యకు చంద్రబాబును రానీయకుండా చేస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్ శనివారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో లోకేశ్ మాట్లాడారు.
'' రాష్ట్రంలో వ్యక్తిగత కక్ష సాధింపులు ప్రత్యక్షంగా చూస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోయేందుకు కష్టపడటం సహజమే. చంద్రబాబు చనిపోవాలి.. చంద్రబాబును చంపేస్తామని వైకాపా నేతలు బాహాటంగా చెబుతున్నారు. కేసుతో సంబంధం లేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైకాపాకు చెందిన మహిళా మంత్రి వ్యాఖ్యానించారు. 'నిజం గెలవాలి' పేరుతో ప్రజల్లోకి నా తల్లి వెళ్తే ఆమెను కూడా అరెస్టు చేస్తామంటారా?
మా ఆస్తులు ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధం
50 రోజులుగా చంద్రబాబును జైలులో ఉంచి ఏం సాధించారు. కొత్త ఆధారం ఒక్కటైనా ప్రజల ముందు పెట్టారా? స్కిల్, ఫైబర్‌నెట్ ఏ కేసులోనైనా కొత్త ఆధారాలు ఏమైనా చూపారా? పార్టీ ఖాతాకు డబ్బులు వచ్చాయని ఒక్క ఆధారమైనా చూపారా?ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేస్తున్నా. స్కిల్ కేసులో మా కుటుంబ సభ్యులు, మిత్రుల పాత్ర లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. మా ఆస్తులు, ఐటీ రిటర్న్‌లు ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నాం..










0 Comments