ఢిల్లీ, సామాజిక స్పందన:
ఓటరు కార్డు (Voter ID) కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. యువకులు 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడనవసరం లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇప్పటి వరకు జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండినవారికే ఓటరు జాబితాలో నమోదుకు అర్హులు కాగా.. తాజా నిర్ణయంతో 17ఏళ్ల వారందరికీ అవకాశం లభించినట్లయ్యింది.
ఓటరు జాబితాలో యువత పేర్ల నమోదుకు సంబంధించి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్‌తోపాటు ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్రపాండే ఈ నిర్ణయాన్ని వెలువరించారు. ఈ సందర్భంగా ముందస్తుగా ఓటరు నమోదుకు అవసరమైన సాంకేతికతకు అందుబాటులో ఉంచాలని అన్ని రాష్ట్రాల్లోని సీఈఓ/ఈఆర్‌ఓ/ఏఈఆర్‌ఓలకు సూచించారు. మరోవైపు ఆధార్ సంఖ్యతో ఓటరు కార్డుల అనుసంధాన ప్రక్రియను ఆగస్టు 1 నుంచి ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసిన ఈసీ.. ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని, స్వచ్ఛందం మాత్రమేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఓటు హక్కు వినియోగానికీ ఆధార్ అనుసంధానానికి ఎటువంటి సంబంధం ఉండదని కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతోంది. ఆధార్ అనుసంధానంతో బోగస్ ఓటర్లను తొలగించటం సులభమవుతుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్న విషయం తెలిసిందే.










0 Comments