పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు ,


 


విజయవాడ: సామాజిక స్పందన

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జనసేన పార్టీ తన వంతు కృషి చేస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు.ప్రభుత్వ పరంగా అయితే ఎన్నో సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. రెండో విడత జనవాణి - జనసేన భరోసా కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సీఎం సహాయనిధి, ఆరోగ్యశ్రీకి సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నట్లు పవన్‌ చెప్పారు.అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ''ఒక ప్రభుత్వం స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేసింది.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇల్లు కట్టుకునేందుకు రుణం మంజూరు చేసింది.. ఈ క్రమంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వైకాపా నేతలు ఆ భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. ఇది అత్యంత దారుణం. 20 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లో నుంచి బాధితులను వెళ్లగొట్టారు. రాష్ట్రంలో నాయకులు ఏం చేస్తున్నారో.. కింది స్థాయి నేతలు కూడా అదే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలే ఎక్కువగా నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి సమస్యలే ముందుగా నన్ను కదిలించాయి.

అధికార మదంతో కొట్టుకుంటారు కాబట్టే ఈ వైకాపా నేతలంటే నాకు చిరాకు.. ఒక నాయకుడు కబ్జాలు చేసి, లంచాలు తీసుకుంటే భరించగలం. కానీ ఆ నాయకుడి లక్షణాలు గ్రామ స్థాయి నాయకుల వరకు చేరితే.. ఎక్కడ చూసినా మినీ వైకాపా అధినేతే ఉన్నట్లు అవుతుంది. విశాఖలో కనిపించిన కొండనల్లా మింగేస్తున్నారు. ఈ అన్యాయాలు ఇప్పుడు అడ్డుకోకపోతే ఇవి కొనసాగుతూనే ఉంటాయి. ఏ ఎంపీటీసీ సభ్యుడైతే స్థలాన్ని లాక్కున్నాడో బాధితులకు తిరిగి ఇప్పించాలి. ఈ బాధ్యత వైకాపా మంత్రులు తీసుకోవాలి. ఇలాంటి పనులు చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. అధికారం ఉంది కదా అని దౌర్జన్యాలు చేస్తే.. తీవ్ర ఉద్యమాలే వస్తాయి. దౌర్జన్యాలు పెరిగితే ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారు. ప్రజలు మిమ్మల్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తారు'' అని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.