మువనుగోడు ఉప ఎన్నిక, అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్





హైదరాబాద్‌, సామాజిక స్పందన:
మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థి పేరును కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేసింది.అభ్యర్థిగా స్రవంతిని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పలువురు పోటీ పడ్డారు. స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్‌, కైలాష్‌ తదితరులు టికెట్‌ను ఆశించారు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారితో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించారు. టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థుల బలాలు, బలహీనతలపై ఏఐసీసీకి నివేదిక పంపించారు. టీపీసీసీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్‌ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది.
భాజపా అభ్యర్థిగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. అనంతరం మునుగోడులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా సమక్షంలో భాజపాలో చేరారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డినే భాజపా తమ అభ్యర్థిగా ప్రకటించనుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెరాస అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది..

@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@


తెలుగు రాష్ట్రాల్లో రాగల 3రోజులు భారీ వర్షాలు: వాతావరణ కేంద్ర హెచ్చరిక


హైదరాబాద్‌, సామాజిక స్పందన

తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇవాళ ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ నుంచి కొమోరిన్‌ ప్రాంతం మరఠ్వాడ, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక అంతటా సముద్రమట్టానికి 0.9కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వివరించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవొచ్చని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ/నైరుతి గాలులు వీస్తున్నాయని వివరించింది.


############ మరిన్ని వార్తలు ###########


రైతు ప్రభుత్వం రాబోతోంది అంటున్న  సీఎం కేసీఆర్

పెద్దపల్లి, తెలంగాణ, సామాజిక స్పందన

 ఇటీవల 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు వచ్చి తనను కలిశారని.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.మరి పోదామా.. జాతీయ రాజకీయాల్లోకి? అంటూ జనాన్ని అడిగారు. పెద్దపల్లిలో సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్‌ బహిరంగ సభలో మాట్లాడారు. గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

'' వచ్చే ఎన్నికల్లో దేశంలో భాజపాను పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతోంది. దేశంలో రైతులు సాగుకు వాడే విద్యుత్‌ కేవలం 20.8శాతమే. దీనికి అయ్యే ఖర్చు రూ.1.45లక్షల కోట్లు మాత్రమే. ఇది కార్పొరేట్‌ దొంగలకు దోచిపెట్టినంత సొమ్ము కూడా కాదు. మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోదీకే మీటర్‌ పెట్టాలి. జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. మీటర్లు లేని విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతున్నారు. ఎన్‌పీఏల పేరుతో రూ.12లక్షల కోట్లు దోచిపెట్టారు. రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావడంలేదు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను భగ్నం చేయాలి. భాజపా ముక్త్‌ భారత్‌ కోసం అందరూ సన్నద్ధం కావాలి'' అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ ప్రసంగంలో కీలక పాయింట్లు..

కలలోనైనా పెద్దపల్లి జిల్లా అవుతుందని అనుకోలేదు. తెలంగాణ వచ్చింది గనక జిల్లా ఏర్పాటుతో పాటు అద్భుతమైన కలెక్టరేట్‌ను నిర్మించుకున్నాం. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరికీ అభినందనలు. దేశమే ఆశ్చర్యపోయేలా పేదలు, రైతులు, మహిళల గురించి అనేక కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం.

కలలో కూడా ఊహించని అనేక కార్యక్రమలు నిర్వహించాం. సింగరేణిలో వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. సింగరేణి కార్మికులకు భారీగా బోనస్‌ అందజేస్తున్నాం. పెద్దపల్లిలో మున్సిపాల్టీలుఏర్పాటు చేసుకున్నాం. రామగుండం పట్టణాన్ని కార్పొరేషన్‌గా, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని పట్టణాలను మున్సిపాల్టీలుగా ఏర్పాటుచేసుకున్నాం.

26 రాష్ట్రాల నుంచి నన్ను కలిసేందుకు అనేకమంది రైతు నేతలు వచ్చారు. కేసీఆర్‌.. రాష్ట్రమంతా మేం తిరిగాం.. చూశాం.. రైతులతో మాట్లాడాం. ఈ రాష్ట్రంలో అమలవుతున్న ఏ కార్యక్రమమూ మా వద్ద లేదు. మీరు దయచేసి జాతీయ రాజకీయాల్లోకి రావాలి అని వారంతా నన్ను అడుగుతున్నారు. పోదామా.. జాతీయ రాజకీయాల్లోకి.. పోదామా..?

 దేశంలో గుజరాత్‌ మోడల్‌ అని చెప్పి దేశ ప్రజల్ని దగా, మోసం చేసి అధికారంలోకి వచ్చిన భాజపా ఏం చేస్తోంది. అడ్డగోలుగా ధరలు పెంచడం, గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు, శ్మశానాలపై పన్ను, పాలపైనా జీఎస్టీ, చేనేత కార్మికులపై జీఎస్టీ.. పేద ప్రజల ఉసురుపోసుకుంటూ.. ఎన్‌పీఏల పేరిట రూ.లక్షల కోట్ల ప్రజాధానాన్ని కుంభకోణాలతో దేశాన్ని మోసం చేస్తున్నారు. గాంధీ పుట్టిన రాష్ట్రం, మావద్ద మద్యం నిషేధించామంటూ చెబుతారు. అలాంటి రాష్ట్రంలో, ప్రధాని స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. ఈ మద్యం తాగి 70-75మంది మృతిచెందారు. దీనికి మీ సమాధానం ఏంటి మోదీ గారూ.

తెలంగాణలో ఉండే ఏ ఒక్క మంచి కార్యక్రమం కూడా ప్రధాని రాష్ట్రమైన గుజరాత్‌లో రాదు. 24గంటల కరెంటు రాదు.. రూ.2వేల పింఛను రాదు. పేదలకు ఆరోగ్యశ్రీలాంటి పథకం లేదు. దోపిడీ తప్ప మరేమీ లేదు. అక్కడి నుంచి వచ్చే గులాంలు, దేశాన్ని దోచే దోపిడీ దొంగలు, ఆ దొంగల బూట్లు మోసేవాళ్లు తెలంగాణలో ఈరోజు కనబడుతున్నారు. 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు నాతో చెప్పారు. తెలంగాణలో ఉన్న ఏ ఒక్క పథకం తమ వద్ద లేదని. మా వడ్లు కొనరు. ప్రధానికి ధాన్యం కొనమంటే కొనడం చేతకాదు. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి కాదు.. నూకలకు, గోధుమ పిండికి కొరత వస్తోంది. ఈ తెలివి తక్కువ కేంద్రం వల్ల గోధుమలు, బియ్యం దిగుమతి చేసే పరిస్థితి వస్తోంది.

కేంద్రానికి ముందుచూపు లేక.. పరిపాలన చేతకాక.. పిచ్చివిధానాలతో అట్టర్‌ప్లాఫ్‌ చేసి దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చి.. రూపాయి విలువ పతనం చేసి.. అంతర్జాతీయ మార్కెట్లో దేశ ప్రతిష్ఠ దిగజార్చిన ఈ ప్రభుత్వం ఏం చేస్తోందో చూస్తున్నాం. మోసపోతే గోసపడతాం. ఒక్కసారి దెబ్బతింటే వెనక్కిపోతాం. కూల్చడం తేలిక.. కట్టడం చాలా కష్టం.

 రైతులకు మేలు చేస్తే.. రైతు కూలీలకు పెన్షన్‌ ఇస్తే.. పేదలను ఆదుకొంటే.. అవి ఉచితాలు, బంద్‌ పెట్టమంటున్నారు. రైతులకు ఉచిత కరెంటు ఇస్తే లేదు లేదు ఇవ్వొద్దని మీటరు పెట్టమంటున్నారు. మీటరు ఎందుకు, దేని కోసం పెట్టాలి?

ఈ పెద్దపల్లి నుంచే నేను ప్రకటిస్తున్నా.. .. రేపు దేశంలో భాజపాను పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతోంది. ఈ గోల్‌మాల్‌ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది పచ్చి అబద్ధం. దేశంలో ఉన్న మొత్తం రైతులు.. ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కలిపి వ్యవసాయానికి వాడే కరెంటు కేవలం 20.8శాతం మాత్రమే. దాని ఖరీదు రూ.1.45లక్షల కోట్లే. ఒక కార్పొరేట్‌ దొంగకు దోచిపెట్టినంత కాదు కదా మోదీ జీ. ఎందుకు రైతుల ఉసురు పోసుకోవాలి. రైతులకు మీటర్లు పెట్టాలని వెంబడిపడే భాజపా, నరేంద్ర మోదీకి మనమందరం కలిసి మీటర్‌ పెట్టాలి'' అని కేసీఆర్‌ మండిపడ్డారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.