కృష్ణా జిల్లా, సామాజిక స్పందన
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్య నేతలు ఎన్నికల ముందు తమ ఆలోచనలపైన స్పష్టత ఇస్తున్నారు. పార్టీల జంపింగ్స్ పెరిగాయి. ఇప్పటికే వైసీపీ..టీడీపీల్లో చేరికలు మొదలయ్యాయి.
ఇదే సమయంలో ప్రస్తుతం టీడీపీలో ఉన్నా..పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న వంగవీటి రాధా పార్టీ మారేందుకు రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది. సన్నిహితుల నుంచి వస్తున్న ఒత్తిడితో రాధా టీడీపీ వీడి జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారని సమాచారం. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. వంగవీటి రాధా నిర్ణయం విజయవాడ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది. నగర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమవుతోంది.
జనసేనలోకి వంగవీటి రాధా..
వంగవీటి రాధా జనసేనలో చేరటం దాదాపు ఖాయమైంది. రాధా గతంలో ప్రజారాజ్యంలోనూ పని చేసారు. జనసేనాని పవన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలోనే రాధా జనసేనలో చేరుతారనే వార్తలు వచ్చినా.. టీడీపీ - జనసేన పొత్తు విషయంలో నిర్ణయం కోసం వేచి చూసినట్లుగా చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ విజయవాడలో వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే పార్టీలోకి రాధాను ఆహ్వానించినట్లు ప్రచారం సాగింది. రంగా 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినాయకత్వంతో విభేదించి టీడీపీలో చేరారు. కానీ, ఆయనకు గత ఎన్నికల్లో సీటు దక్కలేదు, ఎమ్మెల్సీగా ఇస్తారని భావించినా..సాధ్యపడలేదు. టీడీపీలోనే రాధా కొనసాగుతున్నా.. రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇక, ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలని రాధా నిర్ణయించారు. అందులో భాగంగా జనసేనలో చేరికకు నిర్ణయించినట్లు సమాచారం.
చేరిక ముహూర్తం ఖరారైదంటూ
వంగవీటి రాధా జనసేనలో చేరిక ముహూర్తం దాదాపు ఖారారైందని సన్నిహితుల సమాచారం. మార్చి 14న జనసేన ఆవిర్బావ సభ జరగనుంది. ఆ సమయంలో వంగవీటి రాధా అధికారికంగా జనసేనాని పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అదే విధంగా మార్చి 22న ఉగాది ముహూర్తం కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావ సభ తరువాత పవన్ కల్యాణ్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు ప్రారంభించాలని నిర్ణయించారు. ముందుగా విజయవాడ నగరం నుంచే సమీక్షలు చేపట్టనున్నారు. వంగవీటి రాధా 2004లో కాంగ్రెస్ నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 లో ప్రజారాజ్యం నుంచి విజయవాడ సెంట్రల్ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసినా గెలవలేదు. 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు జనసేన నుంచి రాధా పోటీ చేసే నియోజకవర్గం ఖరారైనట్లు చెబుతున్నారు.
రాధాకు సీటు ఖరారు.. పొత్తు వేళ
వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు. 2009లో రాధా ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన సమయంలో 51,578 ఓట్లు రాగా, కాంగ్రెస్ నుంచి గెలిచిన మల్లాది విష్ణుకు 52,426 ఓట్లు వచ్చాయి. 2019 లో టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఉమకు 70,696 ఓట్లు రాగా, వైసీపీ నుంచి గెలిచిన మల్లాది విష్ణుకు 70,721 ఓట్లు పోలయ్యాయి. దీంతో..సెంట్రల్ లో ఈ సారి రాధా పోటీ చేస్తే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ జనసేన నుంచి రాధా పోటీలో నిలిస్తే బోండా ఉమకు ప్రత్యామ్నాయం టీడీపీ అధినాయకత్వం చూపించాల్సి ఉంటుంది. అందుకు బోండా ఉమా సిద్దంగా ఉన్నారా అనేది ఇప్పుడు మరో చర్చ. అయితే, రాజకీయంగా జనసేనలో రాధా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో.. విజయవాడ కేంద్రంలో ఇప్పుడు కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.
.jpeg)









0 Comments