బెంగళూరు, సామాజిక స్పందన

జాబిల్లి (Moon)పై పరిశోధనలకు రోదసిలోకి వెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 (Chandrayaan-3) లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఇది మరింత చేరువైంది..

బుధవారం జాబిల్లి చివరి కక్ష్యలోకి ప్రవేశించింది.

చంద్రయాన్‌-3 (Chandrayaan-3) కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని (Orbit Reduction Maneuvre) నేడు మరోసారి విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో (ISRO) ప్రకటించింది. నేటి విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలు పూర్తయ్యాయి. జాబిల్లి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష్య. తాజా విన్యాసంతో వ్యోమనౌక కక్ష్యను 153 km x 163 kmలకు తగ్గించినట్లు ఇస్రో వెల్లడించింది. దీంతో ఈ అంతరిక్ష నౌక.. ఇప్పుడు చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరింది..

ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన దశలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక, ఆగస్టు 17న వ్యోమనౌకలోకి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోయే ప్రక్రియను చేపడతారు. అది సజావుగా జరిగితే ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోయి సొంతంగా జాబిల్లిని చుట్టేస్తుంది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో (ISRO) వెల్లడించింది.

'చంద్రయాన్‌-3 (Chandrayaan-3)'ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న 'ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య'లోకి ప్రవేశపెట్టారు. అక్కడినుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు..