ప్రతిపక్ష పాత్రనూ సమర్థంగా నిర్వర్తిస్తాం అంటున్న కేటీఆర్


  తెలంగాణ , సామాజిక స్పందన

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని బీఆర్‌ఎస్‌ పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు.


సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్‌ సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలుగా గెలిచినవారిని ఆయన అభినందించారు.


పదేండ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చినా, బీఆర్‌ఎస్‌ పార్టీకి గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని చెప్పారు. ఎన్నికల తర్వాత ప్రజల నుంచి పార్టీ నాయకత్వంపైనా సానుకూలత స్పందన వస్తున్నదని, బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం కోల్పోతుందని అనుకోలేదని సమాజంలోని అన్ని వర్గాల నుంచి వేలాది మేసేజ్‌లు వస్తున్న విషయాన్ని వారంతా కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.


ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో త్వరలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు కేటీఆర్‌ పేర్కొన్నారు. సమావేశంలో అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి, కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతామని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం, ప్రగతిభవన్‌ కేంద్రంగా విధులు నిర్వహించిన తామంతా ఇకపై తెలంగాణభవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు.


ఈ సమావేశంలో తాజా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, ఎంపీలు రంజిత్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్‌ తదితర ఎమ్మెల్యేలతోపాటు రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలు, పోటీచేసిన పలువురు నాయకులు పాల్గొన్నారు. కాగా, పార్టీ అధినేత కేసీఆర్‌ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న వారంతా తమతమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకొని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ రాజీనామాపత్రాలను పంపారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.