తెలంగాణ, సామాజిక స్పందన
నేడు తెలంగాణలో పోటాపోటీకార్యక్రమాలు.. హైదరాబాద్‌లో అమిత్‌షా, కేసీఆర్ సభలు లెఫ్ట్ ర్యాలీలు.. పాతబస్తీలో ఎంఐఎం సభ
సెప్టెంబర్ 17పై ఎవరి దారి వారిదే తెలంగాణలో సెప్టెంబర్ 17 చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి..
హైదరాబాద్ సంస్థానం నిజాం నుంచి దేశంలో అంతర్భాగమైన తేదీకి ఒక్కో పార్టీ ఒక్కో భాష్యం చెబుతూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించలేదు. ఈసారి మాత్రం పోటాపోటీ కార్యక్రమాలకు దిగాయి. నిజాం నుంచి తెలంగాణ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేసింది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వమని ఆ పార్టీ నేతలు చెబుతుంటే.. నిజాం అరాచకాల నుంచి సర్దార్ వల్లభాయ్‌పటేల్ విమోచనం కలిగించారని బీజేపీ పేర్కొంటోంది.
విలీనం, విమోచనం కాకుండా టీఆర్‌ఎస్ దీన్ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించింది. ఎంఐఎం కూడా సమైక్యతా దినోత్సవంగా పరిగణించాలని కోరింది. వామపక్షాలు దీన్ని విలీనంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణలో ఆయా పార్టీలు నిర్వహించే కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
విమోచన దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న కర్నాటక, మహారాష్ట్రలోని ప్రాంతాలు కూడా విమోచనం పొందినందున ఆయా రాష్ట్రాల సీఎంలు పాల్గొంటున్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తోంది. ఉదయం పబ్లిక్‌గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్డు నుంచి ఎన్టీఆర్ గ్రౌండ్స్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో గాంధీ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ తల్లి నమూనాను కూడా ఆవిష్కరించనున్నారు.
వామ పక్ష పార్టీలు ర్యాలీలు నిర్వహించనున్నాయి.
ఎంఐఎం ఆధ్వర్యంలో పాతబస్తీలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు అంటున్న వెంకయ్య నాయుడు
హైదరాబాద్, సామాజిక స్పందన
తెలంగాణలో సెప్టెంబర్ 17పై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది.ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి విమోచన దినోత్సవ వేడుకల కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు.. శనివారం ఉదయం విమోచన దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్ వద్ద మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ అఖండ దేశభక్తుడు. దేశ సమైక్యతకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు. కులమతాలకు వ్యతిరేకంగా దేశ సమైక్యత కోసం ముందుకెళ్లాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయింది. దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్‌కు స్వాతంత్రం వచ్చింది అని అన్నారు.
ఇదిలా ఉండగా.. బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బీజేపీ కార్యాలయంలో జాతీయజెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ బస్సల్, తరుణ్‌చుగ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం, సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.











0 Comments