సామాజిక స్పందన తెలంగాణ హైదరాబాద్
హైదరాబాద్ అడ్డాగా హవాలా విచ్చలవిడిగా నడుపుతున్నారు నేరస్తులు అయితే ఈ సొమ్ము తరలింపునకు కోడ్ భాష కూడా సృష్టించారు, కేజీ అంటే లక్ష రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో హవాలా తరలింపుకు కేంద్రంగా మారింది హైదరాబాద్ మహానగరం.
హవాలా సొమ్ము తరలింపులో కొందరు వ్యాపారులు కోడ్ భాషలు ఉపయోగిస్తున్నారు. సాధారణంగా కేజీ అంటే కిలో బరువు కాగా.. వారికి మాత్రం రూ.లక్ష నగదు అని అర్థం. హైదరాబాద్‌లో తాజాగా రూ.1.27 కోట్ల సొమ్ము పట్టుబడింది. దీన్ని తరలిస్తున్నవారు ఈ కోడ్ భాషను ఉపయోగించారని సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడుతోంది. తాజాగా హైదరాబాద్‌లో రూ.1.27 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం తెలిపారు. హైదరాబాద్‌లోని గోల్నాక, ఉస్మాన్‌గంజ్‌కు చెందిన వ్యాపారులు ఎం.శ్రీనివాస్, విశ్వనాథ్ శెట్టి మంగళవారం ఈ నగదును కవాడిగూడలోని ఓ వ్యక్తికి చేరవేసేందుకు బైకుపై బయల్దేరారు. టాస్క్‌ఫోర్స్ సీఐ ఆర్.రఘునాథ్, ఎస్సై సాయికిరణ్ బృందం హిమాయత్‌నగర్ లిబర్టీ క్రాస్‌రోడ్ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఈ నగదు బయటపడింది. దీనికి సరైన లెక్కలు చూపలేదు. దీంతో నగదుతో పాటు బైకును స్వాధీనం చేసుకొని.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కలెక్షన్ బాయ్ కె.ఫణికుమార్‌రాజును అరెస్టు చేశారు. తదుపరి చర్యల కోసం ముగ్గురు నిందితులతో పాటు నగదును నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. ఒకచోట 10, మరోచోట 30 కేజీల సరకు అందించాలని తమకు ఆదేశాలున్నాయని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారని తెలిసింది.










0 Comments