హిందూ కళాశాల నేడు వైసీపీ పాలకుల నిర్లక్ష్యానికి మసకబారిపోతోంది..



అమరావతి, సామాజిక స్పందన

1856లో స్థాపించిన మచిలీపట్నం హిందూ కళాశాల  నేడు వైసీపీ పాలకుల నిర్లక్ష్యానికి మసకబారిపోతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  అన్నారు..

శనివారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ..''ఎంతో ఉదారత... మరెంతో సదాశయంతో ఆవిర్భవించిన హిందూ కళాశాల దైన్య స్థితిని చూశాక తీవ్రమైన ఆవేదన కలుగుతోంది. చివరకు అధ్యాపకులు, సిబ్బందికి నెలనెలా జీతాలు ఇవ్వలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఎయిడెడ్ కళాశాలగా రూపాంతరం చెందిన ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది. అయితే ఈ కళాశాలకు నిధులు రావడం ఆగిపోగా, బకాయిలు రూ.2 కోట్ల వరకు చేరుకున్నాయి. జీతాలు లేక అల్లాడిపోతున్న సిబ్బంది చివరకు చేసేది లేక కోర్టు మెట్లు ఎక్కారని తెలిసింది. కళాశాల పేరు మీద 14 ఎకరాల భూమి ఉంది. భవిష్యత్తులో మరెన్నో విద్యాసంస్థల ఏర్పాటుకు ఈ స్థలాన్ని రిజర్వు చేసి.. కళాశాల కమిటీ యాజమాన్యం ఉంచింది. అయితే సిబ్బంది జీతాలు చెల్లించడానికి ఈ భూములను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసి చాలా బాధ కలిగింది'' అని పవన్ కళ్యాణ్ తెలిపారు..


హిందూ కళాశాల పునర్ వైభవానికి కృషి చేయాలి


''జగనన్న విద్యా కానుక పేరిట నాసిరకం బ్యాగులు, బూట్లు విద్యార్థులకు ఇచ్చి కోట్లు కొల్లగొట్టడానికి దారులు వెతికిన ప్రభుత్వ పెద్దలకు.. ఉన్నతాశయంతో ఏర్పాటైన ఈ కళాశాలకు రూ.2 కోట్లు ఇచ్చేందుకు దారులు కనపడలేదంటే ఆశ్చర్యమే.ఈ ప్రభుత్వ విద్యా విధానం చూస్తుంటే "ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట!" అన్న సామెత గుర్తుకు వస్తోంది. ఉగ్గు పాలతోనే పిల్లలందరికి ఇంగ్లీష్ నేర్పుతామంటున్నజగన్ సర్కారు .. ఉన్నతమైన ఆశయంతో ఏర్పాటైన మచిలీపట్నం కళాశాలను ఎందుకు రక్షించడం లేదో అర్థం కావడం లేదు. ఎంతో చరిత్ర కలిగిన ఈ కళాశాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వైసీపీ సర్కారు... ఈ కళాశాల పునర్ వైభవానికి కృషి చేయకపోతే ఎన్నికల అనంతరం జనసేన పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుంది'' అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.