తెలంగాణ, సామాజిక స్పందన
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి నాయకురాలు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ కు ప్రశ్నల వర్షం సంధించారు..
బంగారు తెలంగాణను కేసీఆర్ అప్పులు తెలంగాణగా మార్చారని నిర్మల సీతారామన్ మండిపడ్డారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని నిర్మల సీతారామన్ విమర్శించారు..
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నిర్మల సీతారామన్ కెసిఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రానికే ఎంతో గొప్ప అని చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోతున్నాయి అని నిర్మల సీతారామన్ విమర్శించారు..
నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన అంశంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని పేర్కొన్న నిర్మల సీతారామన్ నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడ? చెప్పాలని కెసిఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నిరుద్యోగ భృతి ఇస్తామని కనీసం అది కూడా ఇవ్వకుండా వదిలేశారని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు..
అవినీతికి పాల్పడిన ప్రభుత్వం మనకు కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దేశంలోనే అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ పాలసీల వల్లే హైదరాబాద్ కు పెద్ద కంపెనీలు వస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం పెట్రోలు ధరలు తగ్గించినా కేసీఆర్ వ్యాట్ తగ్గించకుండా బిజెపిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని నిర్మల సీతారామన్ మండిపడ్డారు..
తెలంగాణ యూనివర్సిటీలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దేశం వ్యాప్తంగా 72 శాతం అక్షరాస్యత ఉంటే తెలంగాణలో 66% ఉందని నిర్మల సీతారామన్ తెలిపారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగా లేదని ప్రజలపై రుణభారం మోపుతున్నారని నిర్మలా సీతారామన్ కెసిఆర్ ను టార్గెట్ చేశారు..










0 Comments