చంద్రబాబుతో ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ, రాజకీయ వర్గాల్లో చర్చ, అసలేం జరిగింది ?

 


ఆంధ్రప్రదేశ్ , సామాజిక స్పందన

తెదేపా అధినేత చంద్రబాబు  తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..


గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైకాపా తరఫున ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయంలో నారా లోకేశ్‌  తో కలిసి ప్రశాంత్‌ కిషోర్‌ కనిపించారు. అనంతరం వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ప్రశాంత్‌ కిషోర్‌తోపాటు షో టైమ్‌ కన్సల్టెన్సీ పేరిట తెదేపాకు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్‌ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు..


కీలక అంశాలు ప్రస్తావించిన ప్రశాంత్‌ కిషోర్‌?


తెదేపా అధినేత చంద్రబాబు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ల మధ్య దాదాపు 3గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. జగన్‌ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఆయా వర్గాలు, అంశాల వారీగా ప్రభుత్వ బలాబలాలను పీకే వివరించినట్టు తెలుస్తోంది. ''వైకాపా ప్రభుత్వ విధానాలపై యువత తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ఉన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్యుత్‌ బిల్లులు, పన్నుల బాదుడు వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. దళితులు, బీసీలపై దాష్టీకాలు ఆయా వర్గాలను వైకాపాకు దూరం చేశాయి. ఒకరిద్దరు మినహా.. కేబినెట్‌ మంత్రులకు సున్నా మార్కులు'' అంటూ పీకే వ్యాఖ్యానించినట్టు సమాచారం. ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని, దానికి అనుగుణంగా ప్రతిపక్షం వ్యూహరచన ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న యువతను ఆకర్షించేలా తెదేపా కార్యాచరణ ఉండాలని, చంద్రబాబు అరెస్టుతో న్యూట్రల్స్‌ పాటు కొంత మేర వైకాపా వర్గాల్లోనూ జగన్‌పై వ్యతిరేకత వచ్చిందని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పినట్టు సమాచారం..


సమావేశం ముగిసిన తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రశాంత్‌ కిషోర్‌ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. 'చంద్రబాబు సీనియర్‌ నేత. అందుకే మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసేందుకు వచ్చా. దీనిపై ఎలాంటి ఊహాగానాలు వద్దు'' అంటూ పీకే అక్కడి నుంచి వెళ్లిపోయారు..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.