సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు - అసలు ఏంటీ ఒప్పందం.


భారతదేశం, సామాజిక స్పందన :

 పహల్గాం టెర్రి స్టేటస్ తర్వాత సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు, అసలు ఏం జరిగింది అంటే ? 

ప్ర‌పంచంలోనే అత్యంత అరుదైన ఒప్పందాల్లో ఇది ఒకటి. ఇద్ద‌రు నిత్య వైరి దేశాలు, ప‌దేప‌దే యుద్ధాలు చేసుకున్న దేశాలు... త‌మ ప్రాణ‌ధార‌మైన న‌దుల నీటిని శాంతియుతంగా, నియ‌మ‌బ‌ద్ధంగా 60 ఏళ్ల‌కు పైగా ఎలా పంచుకుంటున్నాయి? న‌మ్మ‌శ‌క్యం కాని ఈ క‌థ వెనుక ఉన్న‌దే 'సింధు న‌దీ జ‌లాల ఒప్పందం' (#Indus #Water Treaty).మంగళవారం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. భార‌త్-పాకిస్థాన్ ల మ‌ధ్య ఉన్న ఈ చారిత్ర‌క ఒప్పందం క‌థేంటో చూద్దాం రండి.


విభ‌జ‌న గంద‌ర‌గోళంలో పుట్టిన వివాదం


#1947 లో దేశం రెండుగా విడిపోయిన‌ప్పుడు, భార‌త‌దేశంలో అత్యంత కీల‌క‌మైన న‌దీ వ్య‌వ‌స్థ‌ల్లో ఒక‌టైన సింధు న‌ది, దాని ఉప‌న‌దులు భార‌త్, పాకిస్థాన్ ల మ‌ధ్య‌లో ప‌డ్డాయి. పంజాబ్, సింధ్ ప్రాంతాల‌కు ఈ న‌దులే జీవ‌నాధారం. నీటి పంపిణీపై మొద‌ట్లో ఎటువంటి స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో రెండు దేశాల మ‌ధ్య తీవ్ర‌మైన ఆందోళ‌న నెల‌కొంది. ఎవ‌రెవ‌రు ఎంత నీటిని వాడుకోవాలి? ఆన‌క‌ట్ట‌లు క‌ట్టుకోవ‌చ్చా? వంటి అనేక ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. ప‌రిస్థితి చేయిదాటిపోయేలా అనిపించింది.


రంగంలోకి దిగిన ప్ర‌పంచ బ్యాంకు: 


9 ఏళ్ల చ‌ర్చలు

ఈ సంక్షోభాన్ని గుర్తించిన ప్ర‌పంచ బ్యాంకు (#WorldBank) ఇరు దేశాల మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించింది. అప్పటికే భార‌త్-పాకిస్థాన్ ల మ‌ధ్య ప‌రిస్థితి అంతంత మాత్ర‌మే ఉన్నా, భ‌విష్య‌త్‌లో నీళ్ల కోసం యుద్ధం వ‌చ్చే ప‌రిస్థితి రాకూడ‌ద‌ని ప్ర‌పంచ బ్యాంకు గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టింది. ఏకంగా తొమ్మిదేళ్ల పాటు సుదీర్ఘంగా, క‌ఠినంగా చ‌ర్చలు జ‌రిపి చివ‌ర‌కు ఒక అంగీకారానికి వ‌చ్చేలా చేసింది. ఆ ఫ‌లిత‌మే 1960 సెప్టెంబ‌ర్ 19న క‌రాచీలో కుదిరిన సింధు న‌దీ జ‌లాల ఒప్పందం. అప్ప‌టి భార‌త ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్య‌క్షుడు ఆయూబ్ ఖాన్ ఈ చారిత్ర‌క ఒప్పందంపై సంత‌కాలు చేశారు.


ఒప్పందం ఏం చెబుతోంది? ఎవ‌రికి ఏ న‌ది?


ఈ ఒప్పందం సింధు న‌దీ వ్య‌వ‌స్థ‌లోని ఆరు కీల‌క ఉప‌న‌దుల‌ను ఇరు దేశాల మ‌ధ్య పంచుకోవ‌డానికి ఒక స్ప‌ష్ట‌మైన మార్గాన్ని చూపింది. దీన్ని సింపుల్‌గా ఇలా అర్థం చేసుకోవ‌చ్చు:


1.భార‌త్‌కు ద‌క్కిన‌వి - 'తూర్పు న‌దులు': రావి (Ravi), బియాస్ (Beas), స‌ట్లెజ్ (Sutlej). ఈ మూడు న‌దుల జ‌లాల‌ను భార‌త‌దేశం పూర్తి స్వేచ్ఛ‌తో, ఎటువంటి ఆటంకం లేకుండా వాడుకోవ‌చ్చు. వ్య‌వ‌సాయం, విద్యుత్, తాగునీరు... ఇలా దేనికైనా మ‌నం వాడుకోవ‌డానికి ఈ ఒప్పందం పూర్తి హ‌క్కు ఇచ్చింది.


2.పాకిస్థాన్‌కు ద‌క్కిన‌వి - 'ప‌శ్చిమ న‌దులు': సింధు (Indus), జీలం (Jhelum), చీనాబ్ (Chenab). ఈ న‌దుల‌పై పూర్తి అధికారం పాకిస్థాన్‌కు ఇచ్చారు. అవి భార‌త్ గుండా ప్ర‌వ‌హించినా, వాటి జ‌లాల‌ను వాడుకునే హ‌క్కు పాకిస్థాన్‌కే ఎక్కువ‌.


3.భారత్‌కు ఉన్న 'చిన్న' హ‌క్కులు: అయితే, ప‌శ్చిమ న‌దులు (సింధు, జీలం, చీనాబ్) భార‌త్ భూభాగం గుండా కూడా వెళ్తాయి కాబ‌ట్టి, వాటిపై భారత్‌కు కొన్ని ప‌రిమిత, స్ప‌ష్ట‌మైన హ‌క్కులు ఉన్నాయి. నీటిని పెద్ద‌గా వాడుకోకుండా (Non-consumptive use) కేవ‌లం కొన్ని ప‌నుల‌కు మాత్ర‌మే వాడుకోవ‌చ్చు. ముఖ్యంగా:


చిన్న ప్రాజెక్టుల‌తో క‌రెంట్: 


నీటి ప్ర‌వాహాన్ని ఆపకుండా చిన్న‌పాటి హైడ్రో ఎల‌క్ట్రిక్ ప్రాజెక్టులు క‌ట్టుకోవ‌చ్చు. కానీ దీనికి కూడా ఒప్పందంలో పేర్కొన్న క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి.

ప‌రిమిత సాగునీరు, నిల్వ: కొన్ని నిర్దిష్ట ప్రాంతాల‌లో ప‌రిమిత స్థాయిలో సాగునీటిని, చిన్న‌పాటి నిల్వ‌ల‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. అయితే, ఈ వాడుక పాకిస్థాన్ కు ద‌క్కాల్సిన నీటి ప్ర‌వాహానికి ఎక్క‌డా అడ్డు రాకూడ‌దు.


గొడ‌వ వ‌స్తే ఎలా ప‌రిష్క‌రించుకోవాలి? - ప‌క్కా రూల్ బుక్


ఈ ఒప్పందం ఇంత కాలం నిల‌బ‌డ‌టానికి అతి ముఖ్య‌మైన కార‌ణం,ఇందులో వివాదాల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డానికి ఒక ప‌క్కా రూల్ బుక్ (వ్య‌వ‌స్థ‌) ఉండ‌టం.


ముందస్తు చర్చలు:ఇరు దేశాల‌కు చెందిన జ‌ల క‌మిష‌న‌ర్లు ఉండే 'శాశ్వత సింధు కమిషన్' (Permanent Indus Commission - PIC) ఎప్ప‌టిక‌ప్పుడు క‌లుస్తూ, ఒప్పందం అమ‌లును ప‌ర్య‌వేక్షిస్తూ ఉంటుంది. ఏవైనా చిన్న‌పాటి సందేహాలు, స‌మ‌స్య‌లు ఉంటే క‌మిష‌న్ స్థాయిలోనే మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకుంటారు.

నిపుణుడి సాయం తీసుకుందాం: క‌మిష‌న్ స్థాయిలో ప‌రిష్కారం కాని చిన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌పంచ బ్యాంకు నియ‌మించే ఒక స్వతంత్ర నిపుణుడు ప‌రిశీలించి తుది నిర్ణ‌యం ఇస్తారు. ఈ నిపుణుడు ఇచ్చే తీర్పు ఇరు దేశాల‌పై బంధ‌నం అవుతుంది.

అక్క‌డ ప‌రిష్కారం కాక‌పోతే కోర్టుకు వెళ్దాం: ఇక పెద్ద‌పాటి వివాదాలు వ‌స్తే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేష‌న్ ఏర్పాటు చేస్తారు. ఇది ఒక తాత్కాలిక కోర్టు. ఇరు దేశాల నుంచి, అలాగే స్వతంత్రంగా కొంద‌రు నిపుణులు ఇందులో ఉంటారు. ఈ కోర్టు ఇచ్చే తీర్పు కూడా ఇరు దేశాల‌కు వ‌ర్తిస్తుంది.

అంటే, నీళ్ల కోసం గొడ‌వ ప‌డి యుద్ధాల దాకా వెళ్లే బ‌దులు, కూర్చుని మాట్లాడుకోవ‌డానికి, కుద‌ర‌క‌పోతే నిపుణుల లేదా కోర్టు సాయంతో ప‌రిష్క‌రించుకోవ‌డానికి ఈ ఒప్పందం ఒక చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన మార్గాన్ని చూపింది.


అనేక యుద్ధాల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డింది


సింధు న‌దీ జ‌లాల ఒప్పందం ప్రాముఖ్య‌త ఏమిటంటే... ఇరు దేశాల మ‌ధ్య 1965, 1971 యుద్ధాలు జ‌రిగినా, కార్గిల్ ఘ‌ర్ష‌ణ వ‌చ్చినా, అనేక సార్లు స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నా.. ఈ ఒప్పందం మాత్రం ర‌ద్ద‌వ్వ‌లేదు, నిలిచిపోలేదు. జ‌లాల పంపిణీ ఆగ‌లేదు. అందుకే దీన్ని ప్ర‌పంచంలోనే అత్యంత నిల‌క‌డైన‌, విజ‌య‌వంత‌మైన జ‌ల ఒప్పందాల్లో ఒకటిగా ప‌రిగ‌ణిస్తారు.


నేటి ప‌రిస్థితి...స‌వాళ్లు ఉన్నా..


అయితే, ఈ మ‌ధ్య కాలంలో ఈ ఒప్పందంపై మ‌ళ్లీ చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌శ్చిమ న‌దుల‌పై భార‌త్ నిర్మిస్తున్న కొన్ని విద్యుత్ ప్రాజెక్టుల డిజైన్‌ల‌పై పాకిస్థాన్ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోంది. అవి ఒప్పంద నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నాయ‌ని వాదిస్తోంది. మ‌న దేశం మాత్రం, త‌న‌కు ఒప్పందం ఇచ్చిన హ‌క్కుల మేర‌కే ప‌నులు చేస్తున్నాని బ‌లంగా చెబుతోంది. ఈ వివాదాలు ప్ర‌స్తుతం స్వతంత్ర నిపుణుడు, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేష‌న్ ద‌గ్గ‌ర ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.


భారత్‌ కూడా తూర్పు న‌దుల (రావి, బియాస్, స‌ట్లెజ్) జ‌లాల‌ను పూర్తిగా వినియోగించుకోవ‌డంపై ఇటీవ‌ల దృష్టి పెట్టింది. పాకిస్థాన్‌కు వృథాగా వెళ్తున్న మ‌న నీటిని ఆపి, మ‌న దేశంలోని పంజాబ్, హ‌ర్యానా, రాజ‌స్థాన్ వంటి రాష్ట్రాల‌కు సాగునీటి అవ‌స‌రాల కోసం మ‌ళ్లించ‌డానికి కొన్ని ప్రాజెక్టుల‌ను వేగ‌వంతం చేసింది. ఇది కూడా ఒప్పందం ప్రకారం భారత్‌కు ఉన్న హ‌క్కే.


మొత్తానికి, సింధు న‌దీ జ‌లాల ఒప్పందం కేవ‌లం న‌దీ జ‌లాల పంపిణీకి సంబంధించిన సాంకేతిక అంశం కాదు. రెండు విరోధ దేశాల మ‌ధ్య కూడా శాంతియుత స‌హ‌జీవ‌నం, స‌హ‌కారానికి అవ‌కాశం ఉంద‌ని నిరూపించిన చారిత్ర‌క డాక్యుమెంట్ అది. స‌మ‌స్య‌లు, స‌వాళ్లు వ‌స్తున్నా, వాటిని ఒప్పందంలో పేర్కొన్న మార్గాల ద్వారా ప‌రిష్క‌రించుకుంటూ ఈ బంధం ఇలాగే ఇంతకాలం కొన‌సాగించారు. ఇక పహల్గాం ఉగ్రదాడితో ఈ ఒప్పందానికి స్వస్తి పలకాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య నీటి యుద్ధం జరిగే అవకాశం ఉంది.. ముఖ్యంగా పాకిస్తాన్‌కు ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.